7680977457

Customer Care

Avanigadda

Krishna District,Andhrapradesh,India

10:00 AM - 6:00 PM

Monday to Saturday

వేణుగోపాలస్వామి వారి దేవాలయం – హంసలదీవి

కృష్ణానదీ  – హంసలదీవి :

సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో,మహాబలేశ్వరo వద్ద కృష్ణమ్మ ప్రభవించినది. గోముఖద్వారంలో ఉన్న శిల్పం నుండి సంననిధారగా    కృష్ణ జాలువారుతుంది. దీనినే గోముఖ క్షేత్రమంటారు. శ్రీ కృష్ణుడు సహ్యాద్రిపై అశ్వత్థ వృక్షరుపంలో నిలిచాడని, ఆ శివుడు తెల్ల ఉసిరిక చెట్టుగా నిలిచాడని, ఆ చెట్ల వేర్ల నుంచి వేణినదీ  ఉద్భవించిందని ఈ రెండు నదుల కలయికే కృష్ణవేణి నది అని పురాణాలు చెపుతున్నాయి. కొన్ని వందల మైళ్ళు ప్రవహించి కృష్ణానదీ కృష్ణా జిల్లాలో పులిగడ్డ  దగ్గర రెండు పాయలుగా చీలుతుంది. ఎదమపాయ శివకేశవ క్షేత్రమైన హంసలదీవి దగ్గర సాగర సంగమం చేస్తుంది. కుడిపాయ, మళ్ళీ మూడు పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది. కృష్ణవేణి నది ప్రతీకగా జన్మించింది. మరల గోపాల శంకర క్షేత్రమై హంసలదీవి దగ్గర సాగరసంగమం చేస్తుంది. శైవ – వైష్ణవ మత  సామరస్యానికి నదులు కూడా ప్రతీకలుగా నిలుస్తాయని కృష్ణానదిని చూచి మనం గ్రహించవచ్చు.

హంసలదీవిలో వేణుగోపాలస్వామి అవతరించిన తీరు:

పూర్వం హంసలదీవి ప్రాంతం తుప్పలతో, పుట్టలతో బలవర్ధకమైన తృణ సముదాయంతో అల్లిబిల్లిగా అల్లుకున్న చెట్లతో చిట్టడవిగా ఉండేది. ఈ ప్రాంతంలో గోపాలకులు తమ ఆవులను మేపుకొంటూ ఉండేవారు. రంగడు అనే పశువుల కాపరి యొక్క మందలోని ఒక ఆవు అక్కడున్న ఒక పుట్టలోకి తన పాలను వర్షింపచేసేది.  ఈ ఆవు పాలను సరిగ్గా ఇవ్వక పోవడాని చూసి, ఒక రోజు రంగడు ఆ ఆవు వెనుకగా వెళ్ళి చూడసాగాడు. సాయంత్రం అయ్యేసరికి అది పుట్టదగ్గరకు వెళ్ళి పాలను స్రవించడం గమనించాడు. కోపం పట్టలేక ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడు.  నిదానంగా నిప్పురాజుకొని మంటలు లేచి ఆ చిట్టడవిని  దగ్ధం చేయసాగాయి. ఇంతలోనే రంగడికి ఒళ్ళు మండడం మొదలైంది. వెంటనే వాడు తాను చేసిన తప్పును గ్రహించి ఏదోవిధంగా మంటను ఆర్పి పెద్దలను తీసుకొని పుట్టదగ్గరకు వచ్చి తవ్వి చూశాడు. లోపల శిరస్సు మాత్రమే ఉండి మిగతా భాగమంతా కాలిపోయినట్లుగా ఉన్న వేణుగోపాల విగ్రహం దొరికింది. దానిని ముట్టుకొన్న వెంటనే రంగడికి ఒళ్ళమంట తగ్గిపోయింది. అందరూ కలిసి గోపాల విగ్రహాన్ని తమకు తోచిన రీతిలో అప్పటి నుంచి పూజలు చేయసాగారు.

ఒకరోజు రాత్రి గ్రామస్థులకు స్వామికలలో కనబడి “ పశ్చిమగోదావరి జిల్లలో కాకరపర్తి అనే గ్రామం ఉంది, అక్కడ ఉన్న భూస్వామి యింటి ఈశాన్యమూల కాకరచెట్టు క్రింద నేనుంటాను.” అని చెప్పగానే గ్రామ పెద్దలు కొందరు కాలినడకన ఆ గ్రామం చేరుకొని ఆ భుస్వమిని కలుసుకొని, “ అయ్యా, మేము ఫలానా గ్రామం వాళ్ళం! మీ ఇంటిలో ఉన్న ఒక వస్తువు కావలి. అది యిస్తారా!’’ అనడిగారు, అంతే ఆ భూస్వామి ఆశ్చర్యంతో, “ మీరెవరో నేనేరుగును. మీకు కావలసిన ఆ వస్తువేమీటో చెప్పండి చూద్దాం!” అన్నారు. అంత గ్రామపెద్దలు “ మీరు ముందు ఇస్తామని వాగ్ధానం చెయ్యండి!” అన్నారు. అంత భూస్వామి “ ఆ వస్తువేదో చెప్పండి!” అనడిగాడు. ఇలా గ్రామ పెద్దలు భూస్వామి మధ్య వారం కొన్ని రోజులు గడిచింది. రోజు గ్రామ పెద్దలు అదేమాట చెప్పటం భూస్వామి ’ ఏమిటిది’ అని అడగడం జరిగేది. చివరకు ఒకరోజున భూస్వామి ‘ మీరంతా ఈ దినం మా యింట్లో ఆతిధ్యం స్వీకరించండి!’ అని కోరాడు. అంతవారు “అలాగే మీ ఆతిధ్యం స్వీకరిస్తాం! మాకు కావలసిన వస్తువునిస్తారా? అనడగగ, అంత భూస్వామి “ సరే ” అఉ భోజనాదికాలు ముగించుకొని భుస్వామితో “ మీయింటి ములలో కాకరపాదు క్రింద తవ్వగా వచ్చిన వస్తువు మాకియ్యవలెనని“ చెప్పారు. అంతా భూస్వామి అలాగే చేయడంతో కాకరకాయ క్రింద గోపాలస్వామి విగ్రహాం దొరకడంతో నిశ్చేష్టుడై, అన్నమాట ప్రకారం స్వామివారి విగ్రహం గ్రామస్థులకు యిచ్చాడు. అలా గ్రామ పెద్దలు స్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చి పెద్దలచేత హంసలదీవి ఆలయంలో ప్రతిష్టచేయించారు.

కొంతకాలం తరువాత తూర్పు చాళుక్య ప్రభువులు లావణ్య విలసితమైన మరొక వేణుగోపాల విగ్రహాన్ని ప్రధాన విగ్రహంగా  ప్రతిష్టించ్చారు. కొన్ని భౌగోళిక రాజకీయ ఉత్పాతాల వల్ల ఈ విగ్రహం  కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత ఇప్పుడు భక్తులకు ‘ దర్శన భాగ్యం కలగచేస్తున్న కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించ్చారు. శరీరం కాలిపోయినట్లుగా ఉన్న విగ్రహాం ఇప్పటికీ ఉంది. దీనిని జాగ్రత్తగా చందనపు చెక్కలయందు ఉంచి,  ప్రతిరోజు చందనలేపనం చేయడం జరుగుతుంది. చందన చెక్కను అరగాదీయడానికి సానతో కూడిన చందనస్తంభం ఆలయంలో ఉంది. ఏది వేణుగోపాల స్వామి ఆవిర్భావ వృతాంతం.

హంసలదీవికి ఆ పేరు ఎలా వచ్చింది :

ఇద్దరు గంధర్వులు  ఆకాశ విహారం చేస్తూ క్రుశ్నోత్పత్తి ప్రదేశమందు తపస్సు చేసుకొంటున్న ఒక మహర్షి యొక్క నల్లని శరీరాన్ని చూసి పరిహాసం చేశారు. దీనికి కోపోద్రిక్తుడైన మహర్షి వారిద్దరిని కాకులగా మారమని శపించాడు. తమ తప్పు తెలుసుకున్న గంధర్వులు పశ్చాత్తాపంతో మహర్షి పాదాలఫై పడి తమ అజ్ఞానాన్ని మన్నించమని, శాపం ఉపసంహరించమని ప్రార్ధించారు. క్రుపవహించిన మహర్షి తన శాపానికి తిరుగులేదని, అయితే శాపనివారణ మాత్రం ప్రసాదిస్తానని చెప్పి, కృష్ణానది అన్ని తీర్దాలలో స్నానం చేస్తూ వెళ్ళండి. ఎదో ఒక తీర్ధం దగ్గర మీకు కాకుల రూపం పోయి హంసల రూపం వస్తుంది. అప్పుడు మీరు హంసలరుపంలోనే ఆకాశగంగలో స్నానం చేస్తే గంధర్వరుపం వస్తుందని చెప్పాడు.  కాకులుగా మారిన గంధర్వులు కృష్ణానది  యొక్క అన్ని తీర్దాలలోను స్నానంచేస్తూ, చివరకు హంసలదీవి (అప్పటికీ ఈ పేరు లేదు) దగ్గర కృష్ణాస్నానం చేయగా హంసల రూపం వచ్చింది. అప్పటినుంచి ఆ క్షేత్రానికి హంసలదీవి అనే పేరు వచ్చిందని ఒక ఇతిహాసం.

ఇక రెండవ కథనం ఏమిటంటే ప్రతిరోజూ రాత్రివేళ యోగీశ్వరులు హంసల రూపంలో వచ్చి కృష్ణలో స్నానం చేసి వేణుగోపాల స్వామిని అర్చించి సేవిస్తుంటారని అందువల్ల హంసలదీవి పేరు వచ్చిందని స్థలమహత్మ్యం  చెపుతుంది.

హంసాకారంలో ఉండే ఒక రకమైన పక్షులు ఇక్కడ విహరించేవి కాబట్టి ఈ ప్రాంతాన్ని హంసలదీవి అని పిలుస్తున్నారని మరికొందరు భావించారు.

దేవాలయం చుట్టూ హంసల బొమ్మలు చెక్కి ఉండడం వల్ల హంసలదీవి అనే పేరొచ్చిందని గ్రామస్థులు చెపుతుంటారు ఇప్పుడు లేవు.

ఇంతకు ముందు హంసాకారంలో ఆలయం తలుపులు ఉండేవని సంవత్సరంలో వచ్చిన పెనుతుఫాను తాకిడికి ఈ తలుపులు విరిగిపోయాయని పెద్దలు చెపుతారు. ఆ హంసాకార తలుపులు వల్ల హంసలదీవి అనే పేరు వచ్చిందని కొందరి ఊహ.

ఆలయస్వరుపం :

దీర్గాచాతురస్రాకార ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎంతోమంది శిల్పాలు రాత్రింబవళ్ళు శ్రమించి తమ ఉలుల సవ్వడులకు శాశ్వతమైన సజీవమైన శిలా శిల్ప సాకారంగా ఈ ఆలయాన్ని మలిచారు. కాని ఏ ఒక్కశిల్పి పేరు కూడా మనకు కనిపించదు.  నిస్వార్ధమైన వారి శిల్పకళా సేవ ప్రసంసనీయం. సముద్రపు పోటును తట్టుకోవడానికి వీలుగా ఒకప్పుడు బలిష్టమైన ప్రాకారం ఆలయం చుట్టూ ఉండేది. కాలక్రమంలో అదంతా శిదిలమైపోయింది. ఇప్పుడు కేవలం మామూలు గోదామాత్రమే కనిపిస్తుంది. ఆలయాన్ని కట్టి వేయి సంవత్సరాలు పైగా అయింది. ఆలయానికి తూర్పుదిశగా శిల్పసమంవితమైన గంభీరమైన రాజగోపురం నిర్మించబడింది. రాజగోపురాన్నే గాలిగోపురం అని కూడా అంటారు. దీనినుండే భక్తులు స్వమిదర్శనార్ధం ఆలయంలోకి ప్రవేశించాలి.

గాలిగోపురం:

కాగా ఎన్నో కతాప్రవాహాలు ఈ ఆలయాన్ని స్పృశిస్తూ ఉంటాయి. అందులో ఈ గోపురం కథ ఒకటి. పూర్వం ఈ గోపురాన్ని ఒక్క రాత్రిలో నిర్మించాలని దేవతలు సంకల్పించి కట్టడం ప్రారంభించారు. ఉషోదయ రేఖలు కనిపించే సమయానికి దద్దళo  వరకు మాత్రమె కట్టగలిగారు. తమ సంకల్పం వికల్పం అయిందని భాదపడి, మనుష్యులకు కనిపించకూడదని దేవతలు వెళ్ళిపోయారు. అప్పటినుండి ఆ గోపురం అసంపూర్ణంగా ఉండిపోయిందని హంసలదీవి గ్రామస్థులు చెపుతుంటారు. అయితే ఒకప్పుడు ఇక్కడ 7 అంతస్థుల గాలిగోపురం ఉండేది. “అచ్చట వినోద గోపురం బమరెనీకు” అనే హంసలదీవి  శతకకర్త వాక్యాన్ని బట్టి200సంవత్సరాల క్రిందట చక్కని గాలి గోపురం  ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత కాలంలో ప్రకృతి వైపరిత్యాలవల్ల గోపురం యొక్క పై అంతస్థులు పడిపోయాయి. దీనిని చూచి ఈ గోపురాన్ని దేవతలు కట్టలేకపోయారనే కథ వ్యాప్తిలోకి వచ్చింది. పూర్వకాలంలో ఈ గోపురం మీద అఖందదీపం ఉండేదని, ఆధునిక్స్ లైట్ హౌస్ వలె ఇది సముద్రంలోని ఓడలకు ఉపకరిసస్తూ ఉండేదని తెలుస్తుంది. హంసలదీవి రేవు కూడా కదా! ఇక ఇటీవలకాలంలో ఈ గాలి గోపురాన్ని దేవాదాయశాఖ వారు సంపూర్ణంగా పునర్నిర్మించారు.

ఈ ఆలయం  ఆగమ-శిల్ప శాస్త్రానుసారంగా కట్టబడింది. ప్రవేశామండపం, ముఖమండపాలతో, అంతరాలయ గర్భాలయాలతో, మూడు ఉపాయాలతో స్వామి ఆలయం నిర్మించబడింది. గర్భగుడిలో సకల భక్త ప్రియుడైన వేణుగోపాలస్వామి చిద్విలాస రూపంతో నిలిచిఉన్నాడు.

దీని భావం ఏమిటంటే త్రిభాగిగా, వేనునాదముద్రతో, శంఖుచాక్రాలతో, స్వామి వేంచేసి ఉన్నారు. రుక్మిణీ సత్యభామ దేవేరులు ఇరుప్రక్కలా ఉన్నారు. స్వామివారికి దక్షిణం వైపు ఉన్న ఉపాలయంలో ఆసీన లక్ష్మీ నరసింహ విగ్రహాం ఉంది. ఉపాలయంలో నరసింహస్వామి ఉండడం దివిసీమ ప్రాంతంలో అరుదైన దృశ్యం. ఉత్తరదిశ వైపున్న ఉపాలయంలో మహావిష్ణువు విగ్రహాం ఉంది. సుందర గంభీరమైన రూపంతో, ఉజ్జ్వలమైన ఆభరణాలతో, కతిసూత్రంతో, ఉరుబంధనంతో, అద్వితీయంగా, కనులపండువుగా, శంఖుచాక్రాలతో అభయ వరద హస్తాలతో భక్తప్రసంన్నంగా  ఉంటాడు ఈ మహావిష్ణువు. ఈ విగ్రహ స్వరూప లక్షణాలు తెలియక చాల కాల వెంకటేశ్వరస్వామి విగ్రహంగా అనుకోవడం జరిగింది. ఇక వేరొక ఉపాయంలో దక్షనాభిముఖియై రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై యున్నారు.

రుక్మిణీ సత్యభామలుండగా మళ్ళీ రాజ్యలక్ష్మి అమ్మవారిని వేరుగా ప్రతిష్చడం ఎందుకు అనే సందేహం మనకు వస్తుంది.

రాజులు తమ రాజ్యాన్ని లక్ష్మితుల్యంగా భావించడం వల్ల రాజ్యానికి ప్రతీకగా రాజ్యలక్ష్మి పేరుతొ మహాలక్ష్మిని ప్రతిష్ట చేస్తుంటారు. ఇది వారి సంప్రదాయం. పద్మాలు ధరించి ఆ ఉర్ధ్వకరాలతో, అభయ వరద హస్తాలతో ఆశ్రిత భక్తులను రాజ్యలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది.

ముఖమండప ప్రవేశద్వారానికి, గర్భాలయ ప్రవేశద్వారానికి, పాతగాలి గోపుర ద్వారానికి జయ విజయులనే ద్వారపాలక విగ్రహాలున్నాయి. ఇవి చాలా విలక్షణంగా ఉంటాయి. ఈ ద్వారపాలకులే శ్రీ మహావిష్ణువు భూలోకంగా అవతారాలు ఎత్తడానికి మూలకారకులు. వీరికి నమస్కరించి ఆలయంలోపలికి వెళ్ళాలి. ఈ రెండు ద్వారాలపైన గజలక్ష్మి శిల్పం చెక్కబడింది. గజలక్ష్మి ఐస్వర్యానికి ప్రతీక. గజలక్ష్మినే ద్వారలక్ష్మి అని కూడా అంటారు. అంతరాలయ ప్రవేశానికి అటు ఇటు శంఖు చక్రాలు చెక్కి ఉన్నాయి. గర్భాలయ ద్వారానికి, రాజ్యలక్ష్మి అమ్మవారి  గర్భాలయ ద్వారానికి పూర్ణకుంభరూపాలు, చెక్కబడ్డాయి. ఈ పూర్ణకుంభ శిల్పం, తొలుత గౌతమ బుద్ధ జనానికి ప్రతీకగా చేక్కేవారు. అప్పటినుంచి ఈ రూపం కొద్దికొద్ది మార్పులు చెందుతూ శాతవాహనుల కాలం నుంచి ఆంద్ర శిల్పంలో ప్రాధాన్యతను కలిగి ఉంది. వ్యవసాయాభివృద్ధికి సూచికగా పూర్ణకుంభాన్ని చెక్కుతారు. ఇక ముఖమండపంలో నాలుగు క్రోష్టాలు ఉన్నాయి. క్రూష్టం అనే ’గూడు’ అని అర్ధం. ఏయోజన నిమిత్తం ఈ క్రోష్టాలు నిర్మించారో ఇప్పటివరకు తెలియడంలేదు.

ఇక్కడి విమానాన్ని ‘విష్ణుక్రాంతము’ అని పిలుస్తారు. ఆలయ కుడ్యాలపై ఉన్న క్రోష్టాలలో గరుత్మంతుడు, లక్ష్మి నారాయణలు ,  నరసింహుడు, తన్దవక్రుష్ణుడు మొదలైన శిల్పాలు ఉన్నాయి. శైవ, వైష్ణవ మతాల సామరస్యానికి ప్రతీకగా దుర్గాదేవి, వరసిద్ధి  వినాయక శిల్పాలు కుడా ఉన్నాయి. గర్భగుడి వెనుక గోడలో ప్రత్యేకంగా ఆరు అoగుళాల ఆంజనేయస్వామి విగ్రహాం చెక్కబడింది. ఇది గాక ఇంకా రెండు ఆంజనేయుని విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. సముద్రాన్ని హనుమంతుడు దాటాడు గనుక, ఓడలకు తమకు రక్షణగా హనుమంతుడు ఉంటున్నాడన్న భక్తి విశ్వాలతో సముద్ర వ్యాపారులు ఆంజనేయ విగ్రహ పాదాలక్రిoద అస్పష్టమైన ఒక శాసనం కుడా ఉంది. ఇంకా సమంగా పోల్చుకోవడానికి వీలులేని జంతువుల బొమ్మలు, శృంగార శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ కుద్యమంతా రమ్యమైన అలంకృత స్తంభాలతో, మకర ముఖాలతో, నాగాబంధాలతో, చాళుక్య శిల్ప కళా వ్య్భావంతో శోభాయమానంగా ఉన్నాయి. అయితే శిల్పాలలోని ప్రత్యెక నాగబంధాలను బట్టి ఆనాటి నాగజాతి ప్రముఖులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకొని ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది చేరపాoడ్య చిహ్నితం కూడా! ఈ శిల్పసంపద ఇప్పుడు పూర్తిగా కనిపించదు. ఆ ఆకారం చెడకుండా ప్లాస్తింగ్ చేసారు. ఇంకా ఆలయ స్తంభాల మీద సీతాలక్ష్మణులతో కలసి పుష్పక వాహనం మీద శ్రీరాముడు అయోధ్యకు వెళుతున్న శిల్పం, వాలి, సుగ్రీవ యుద్ధ శిల్పం, ఆంజనేయ, గరుత్మంతుల యుద్ధ శిల్పం మొదలైనవి ఉన్నాయి.

ఉత్సవాలు:

వేణుగోపాలస్వామి వారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ పౌర్ణమి ల్కలిసి వచ్చే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. మొదటిరోజు విశేషంగా స్నపన చేసి, స్వామివారిని పెండ్లి కుమారునిగా చేస్తారు. తర్వాత లక్ష్మీతులసీ అర్చన జరుగుతుంది. సాయంకాలం అఖందదీపారాధన చేసి, అంకురార్పణ చేసి, ధ్వజారోహణం అనే పేరుతొ గరుడపటాన్ని ధ్వజస్తంభం మీద ఎగరవేస్తారు. రెండవరోజు ఉదయం నిత్యహూమం, బలిహరణ జరుగుతుంది. రాజ్యలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ కుంకుమార్చన  ఘనంగా జరుగుతుంది. సాయంకాలం తెప్ప ఉత్సవం జరుపుతారు. తర్వాత జగజ్యోతి అనే పేరుతొ అఖందదీపాని వెలిగిస్తారు. ఇది దివిసీమ ఆలయాలలో మాత్రమె కనిపించే ఆచారం. బహుశా చల్లపల్లి జమిందారులు దీనిని ఏర్పాటు చేసి ఉంటారు. పిమ్మట నయనానoదకరంగా స్వామివారికి దివ్య తిరుక్కళ్యాణo జరుగుతుంది. గ్రామస్థులందరూ ఈ కళ్యాణం చూడడానికి కదలివస్తారు. మూడవరోజు సాయంకాలం రథోత్సవం జరుగుతుంది. భక్తులందరూ ఉత్సాహంతో రధాన్ని లాగుతూ స్వామికి జేజేలు కొడుతూ భక్తిశ్రద్ధలతో స్వామిని సేవిస్తారు. మరుసటి  రోజు వసంతోత్సవం చేసి, సాయంకాలం గరుడధ్వజాన్ని దించి తర్వాత పవళింపు సేవ చేస్తారు. దీనితో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుటై. ఇది కాకుండా కృష్ణాష్టమి, ముక్కోటి, దసరా మొదలగు ఉత్సవాలు కుడా చేస్తారు. 

Open chat
Chat With Us
Welcome to our site www.diviseema.info, if you need help simply reply to this message, we are online and ready to help.