మోపిదేవి ఆలయ ప్రాముక్యత :
అనాదిగా ఆంధ్రదేశంలో నాగారాధన ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు. ఆంధ్రదేశంలో తొలుతఉన్న జాతులలో నాగులోకరు. వారు సర్పని లేదా నాగజాతిపాములను కులదేవతగా కొలుచుకొనే వాళ్ళు కాబటి వీళ్ళన్దరికి నాగులు లేదా నాగాజాతివారు అనే పేరు వచ్చింది. ఆంధ్రదేశానికి నాగాభూమి అని కూడా పేరు ఉంది. ముఖ్యంగా నేటి దివితలుకా ప్రాంతం ఏదైతే ఉందో ఇదే విస్తీర్ణంలో కృష్ణకు ఉత్తర పక్కగా వున్న ప్రాంతం కూడా కలుపుకొని –ఈ బ్రహాత్ ప్రదేశాన్ని అంతా ఒకపుడు నాగాభూమిగా వ్యవహరించేవారు. పరమేశ్వరుడు సర్పంగ భూషితుడు. నాగాహరుడు, కుమారస్వామి సర్పకారంలో ఇక్కడ వెలవడం జరిగింది. శివలింగం లోనే సర్పాన్ని చూడడం కూడా సంప్రదాయం,దేవతా నాగాపమును సుబ్ర్హమన్యుడుగా భావిస్తున్నాము. ఈ విధంగా సర్పసంభందిత పుజ్జవిధానం –దైవం వెలిసిన క్షేత్రాలలో కృష్ణజిల్లా – దివిసీమలోని మోపిదేవి పేరు ప్రఖ్యాతము.మోపిదేవి క్షేత్రం కృష్ణాజిల్లాలో సుప్రసిద్ధమైనది. కృష్ణాతీరంలోని ఈ క్షేత్రం పరమపావనమైనది. మోహినీపురమని, సర్పక్షేత్రమనే పర్యాయనామాలు మోపిదేవికి ఉన్నాయి.
స్థల పురాణము :
ఇంద్రాదిదేవతల ప్రార్ధన మేరకు లోపాముద్రతో కలసి అగస్త్యమహర్షి వారణాసి నుండి అయిష్టంగానే
బయలుదేరి, మేరువుతో సంఘర్షించి లోకోపద్రవము కలిగిస్తూ ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని నిరోధించిన వింధ్య పర్వతాన్ని చూచి తాను దక్షిణదేశ పుణ్యతీర్ధ యాత్రలకు వెళ్ళుచున్నాను కాబట్టి నీవు కాస్త తగ్గి ఉంటే దక్షిణదేశంలోకి ప్రవేసిస్తాను. మరల నేను వచ్చేటంత వరకు ఆవిధంగానే ఉండమనగా, మునిశక్తికి భయపడి వింధ్య పర్వతం తలవోగ్గింది.లోపాముద్ర సహితుడై అగస్త్యుడు దక్షినావనియందు ప్రవేశించి ఇక్యడ ఉండిపోయాడు. వింధ్య పర్వతానికి శాశ్వతంగా గర్వబంగం చేశాడు. దక్షిణ దేశంలో శిష్యులతో, భర్తతో కలిసి తీర్ధయాత్రలు చేస్తూ కృష్ణానదీ తీరంలో ఉన్న కుమారక్షేత్రానికి (మోపిదేవి) వచ్చాడు. తన దివ్యద్హృష్ట్టితో దాని మాహాత్మాన్ని గాంచినాడు. పాములు ముంగిసలు కలిసి వున్నాయి. నెమలి, పాములు అన్యోన్నంగా వున్నాయి. ఒకచోట దివ్యతేజస్సుతో ప్రకాసించే పుట్టను చూశారు. ఒకానొక అల్పదోష పరిహారం కోసం సుబ్రహమన్యస్వామి ఉరగరూపం ధరించి ఇక్కడ ఒక శ్రేష్టమైన వలిమకంలో తపస్సు చేసుకోనుచున్నాడు. ఈ అంశం గ్రహించి సుబ్రహ్మణ్యస్వామిని కొలిచి తరించవలేనని అనుకున్నాడు.తాను దివ్యద్హృష్ట్టితో చూచిన ఈ విషయాన్ని తనవారితో చెప్పాడు. పడగవలె ఉండే శివలింగాన్ని ఆ పుట్టమిద ప్రతిష్టించాడు. నాగ – కుమార ద్వయం ఎకరూపం నిలిచిన పుణ్యప్రదేసం ఇది. మొట్టమొదటగా ఈ స్వామిని అర్చించిన మహర్షి అగస్త్యులవారు. అగస్త్యమహర్షి చేత పూజింపబడిన సుబ్రహ్మణ్యస్వామి యొక్క మహాత్మ్యాన్ని అవగతం చేసికొన్న దేవతలు, మునులు తమ శక్త్యానుసారం స్వామి వార్కి అర్చన విధులు గావించేవారు. ప్రశాంతమ్తేన ఆ పుణ్యభూమిలో మునులు తపస్సుచేసుకోసాగారు. ఇలా సుదిర్గ్గకాలం జరిగింది. ఈ కాలంలో పుట్టకు గుడిలేదు. భక్తుల సందడిలేదు. లౌకికపు వ్తేభవమూ లేదు.
తొలి పరిచయం:
దేవతాది గణము చేత పూజలందుకొంటున్న సుబ్రహ్మణ్యేశ్వర లింగం కొన్నాళ్ళు కాలగర్భంలో తన ఉనికిని విస్మరింప జేసి పుట్టలోనే అంతర్గతముగా ఉండెను. ఈనాడు మనం చూస్తున్న లింగం ఒక మహాభక్తుని వల్ల చూడగలుగుతున్నాము. పవిత్రమైన ఈ పుట్టకు దగ్గరలో కొంతమంది కుమ్మరులు ఇళ్ళు ఉన్నాయి. అందులో ‘వీరారపు పర్వతాలు‘ అనే వ్యక్తి మహాభక్తుడు. అతనికి స్వప్నములో కుమారస్వామి కనపడి పుట్టలో నుండి లింగము తీసి ప్రతిష్టించమని ఆదేశించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తన వారందరికీ చెప్పి భక్తి ప్రపత్తులతో లింగ ప్రతిష్ట చేశాడు. తర్వాత తనకు తోచిన రీతిలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రీతికారమైన వస్తువులను మృత్తికతో నేర్పుగా చేసి కాల్చి, వాటిని స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. గుఱ్ఱము, నంది, కోడి, గరుత్మంతుడు, మణుల మట్టి విగ్రహాలు తయారుచేసాడు. వాటిని ఈ నాటికి మనం చూడవచ్చు. ఈ విధంగా ఆ కుమ్మరి తనకు తోచినరీతిలో స్వామివారిని సేవిస్తుండేవాడు.
తర్వాత కాలంలో దేవరకోట ప్రభువులు స్వామివారి మహిమలు విని భక్తుల సహకారంతో ఆలయమంతాపాదులు కట్టించి స్వామివారికి సేవలకు ఏలోపం రాకుండా జాగ్రతగా తమ దేవాలయ పాలన గావించాడు. ఇటీవల కాలంలో మరల ఆలయాన్ని సర్వాంగ సుందరoగా దేవాలయశాఖ వారు తీర్చిదిదద్దారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తూర్పుదిశగా ఉన్నది. గర్భగుడిలో లేక పాముచుట్టాల మీద ( ఇదే పావన పట్టం) ఈశ్వరుడు ( లింగం ) ఉన్నాడు. ఈయనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. పావనపట్టం కింద అందరికీ కనబడే విధంగా లోపలి ఒక రంధ్రం ఉoది. అర్చన అభిషేకాదులప్పుడు ఆ రంధ్రంలో పాలు మొదలైనవి పోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షణ మార్గంలో దక్షణం వైపు ఉన్న పుట్ట నుండి గర్భగుడి లోకి లోపల దారి ఉన్నట్లు భక్తుల విశ్వాసం. దేవతా సర్పం ఆ మార్గం గుండా పయనిస్తుంది. గర్భగుడిలో ఉన్న స్వామివారికి అత్యంత భక్తి శ్రద్దలతో అర్చకులు పూజాకార్యక్రమ అభిషేకాదులు చేస్తుంటారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు అనేక విధాలుగా మొక్కుకుంటారు. చేవిపోగులు కుట్టస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. పుట్టలో పాలుపోస్తారు. పొంగలి నివేదన చేస్తారు. కళ్యాణం జరిపిస్తారు. అన్నప్రాశన, అక్షరాభ్యాసం స్వామీ ఆలయంలో జరిపించుకుంటారు.
మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మహన్యాస పూర్వక వారాభిషేకం శాస్త్రోక్తంగా చేస్తారు. చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్న వాళ్ళు, పెళ్లి కానివాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు.
ఇవన్నీ అంచలమైన భక్తి విశ్వాసాలతో భక్తులు చేస్తుంటారు. ఈ ఆలయానికి ఆగ్నేయదిశగా స్వామివారి కళ్యాణమండపం ఉంది. ఇది చల్లపల్లి రాజా వారి వంశీకులు నిర్మించారు. కళ్యాణమండప స్తంభము మీద శిలాఫలకము ఇలా ఉంది.
శ్రీమంతు రాజా అయార్ల గడ్డ శివరామప్రసాద్ బహదూర్ చల్లపల్లి రాజావారి జేష్ఠ పుత్రికయూ, కోయంబత్తూరు వాస్తవ్యులు శ్రీ డి.జయవర్ధనవేలు, వీరి ధర్మపత్ని అయిన శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులచే భక్తి పూర్వకముగా సమర్పించబడినది. మోపిదేవి 31-12-1993.
ఉత్సవాలు :
సుబ్రహ్మణ్యే శ్వరస్వామి వారికి ఆగమబద్ద విధంగా పూజావిధులు సమర్ధంగా నిర్వహించబడతాయి. ఉగాది పర్వదినం, శ్రవణార్చనము, దసరాలో శమీపూజ, కార్తిక దీపారాధనలు,ఆర్ధ్రోత్సవము, నాగులచవితి, నాగపంచమి తిధులలో పూజాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. మాఘంలో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. చవితి ప్రారంభం, పంచమి కల్యాణం, షష్టీ రథం, సప్తమి వసంతోత్సవం జరుగుతాయి. వెలనాటి వారు పరంపరగా అర్చనా కైంకర్యాలు భక్తి పూర్వకంగా జరిపిస్తున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమలు :
సంతానం లేనివారికి సంతానం భాగ్యం కలిగించడం, కనుల చూపు మందగించిన వారికి చక్కని నేత్ర దృష్టిని ప్రసాదించడం, చెవుల బాధ పోటును తగ్గించి సుశ్రణమును అనుగ్రహించుట, శారీరక దౌర్బల్యము వల్ల స్త్రీలకు వచ్చే కుసుమ వ్యాధులను నివారించడం, చర్మంపై పొడలను పోగొట్టడం, పూర్వ జన్మ దుష్కర్మవల్ల సంతానం నశిస్తుంటే,ఆ పాపాన్ని తొలగించడం, విద్యాభివ్రుద్దిని గావించడం, సకల సంపదలు సమకూర్చడం, శారీరక ఆరోగ్యం కలగచేయడం, మనోవ్యదను పోగొట్టి సంసార సౌభాగ్యం ఒసంగడం, స్వామి మహిమలుగా భక్తులలో ప్రగాఢమైన విశ్వాసం, నమ్మిక ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి వందలాది భక్తులు మోపిదేవికి వచ్చి స్వామిని దర్శించి ధన్యులవుతున్నారు.