7680977457

Customer Care

Avanigadda

Krishna District,Andhrapradesh,India

10:00 AM - 6:00 PM

Monday to Saturday

నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం మరియు శివాలయం -విశ్వనాథపల్లి

విశ్వనాధపల్లి :

కృష్ణానదీ తీరంలో ఒకప్పటి అచ్చమైన బ్రాహ్మణ అగ్రహారం  విశ్వనాధపల్లి. ఎందరెందరో మహనీయులు పుట్ట్టిన పవిత్ర భూమి ఇది. ఆదిశక్తి స్వరుపిణి, అద్దంకి నాంచారమ్మ స్వయంభుగా వెలసిల్లిన పుణ్య భూమి ఇది.

ప్రాచీన కధ:

ఒకప్పుడు ఈ ప్రాంతం నుండి పశువులను మేపుకుంటూ కాపు కుటుంబీకులు కొందరు అద్దంకి పరిసర ప్రాంతాలలో ఉండగా, ఉన్నట్టుండి పశువులు నీలగి పడిపోవసాగాయి. అద్దంకి నాంచారమ్మ ఒకరి ఒంటి మీదకు వచ్చి, తనను కోలుచుకోవలసిందిగా, ఆవిధంగా చేస్తే, పశువులను కాపాడుతానని పలికింది. కొండవీటి లేక కొండేటి ఇంటి పేరు గల కాపు కులస్థుల కుటుంబీకులు అమ్మవారి మాటను తలదాల్చి శిలారుపం దాల్చిన అమ్మవారిని భక్తి పూర్వకంగా తీసుకువచి విశ్వనాధపల్లిలో ప్రతిష్టించారని ఒక కథనం. కాగ ఈ కుటుంబీకులు అద్దంకి అమ్మవారిని దర్శించి తిరిగి వస్తుండగా కృష్ణా నదిలో అద్దంకి నాంచారమ్మ విగ్రహం  లభించిందని ఆ అమ్మవారిని సభక్తికంగా  తీసుకువచ్చి ప్రతిష్టించారని మరోక కథ. ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని రాములు, లేదా రామినీడు అనే భక్తుడు చేసాడని ఒక ఐతిహ్యం. ఇతను కూడా కాపుకులస్తుడే! మొదటిగా ఊరిచివరలో అమ్మవారిని ప్రతిష్టించారు. రెండు అడుగుల ఎత్తు కల శక్తిస్వరుపిణి అద్దoకి నాంచారమ్మ అప్పటి నుంచి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంది. అమ్మవారు ఇక్కడకు వచ్చిన తరువాత చాలా గ్రామాలలో ప్రజలు అద్దంకి నాంచారమ్మ పేరుతో అమ్మవారిని గ్రామదేవతగా నిలుపుకున్నారు. అయితే విశ్వనాధపల్లిలో ఉండే నాంచారమ్మకు ఒక విశేషం ఏమిటంటే ఆవిడే  ఇక్కడ కులదేవత. తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఏ విధంగా స్వయంభవుగా  వున్నాడో ఆవిధంగానే అద్దంకి నాంచారమ్మకూడా స్వయంభువు. తరువాత మనం ఏ విధంగా వెంకటేశ్వరస్వామీ వారి ఆలయాలు కట్టుకుంటున్నామో  ఆవిధంగానే నాంచారమ్మ ఆలయాలు కూడా దివిసీమలో వెలిసాయి. నాంచారమ్మ పశువులను కాపాడే దేవతగా బాగా ప్రఖ్యాతిని పొందింది. అందువలన రైతులందరూ తమ పశువులను గుడిచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. దీనివల్ల అవి ఎటువంటి రోగాలకు, దోషాలకు, అన్తుకాకుండా ఉంటాయని వారి నమ్మికా. ఇది నిజం కూడా.

అమ్మవారి ఆలయం  కాలక్షేపం  మండపం, ముఖమండపం, గర్భగుడి అనే మూడు విభాగాలతో ఈనాడు మనకు కనిపిస్తుంది. 1990 సంవత్సరంలో వచ్చిన గాలివానకు ధ్వజస్తంభానికున్న మేఖలాలు ఉడిపోయి రేకు లేచిపోయి స్తంభపు చెక్కంతా చీకిపోయి ఉన్నప్పుడు ఆ చెక్క ధ్వజస్తంభాన్ని తీసివేసి 1002-1999 సంవత్సరంలో శాస్త్రోక్తంగా నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఆలయం మొట్ట మొదట తాటాకులతో ఉండేదట. తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందసాగింది. నూతన ఆలయ శంఖుస్థాపన లో జరగగా, 10-03-1987వ సంవత్సరంలో పునః ఆలయ నిర్మాణం, నాంచారమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది. దిగువగా ఉన్న ఆలయాన్ని నవీకరించి ఎత్తు బాగా పెంచి నేడు వేలాది భక్తలు సులభంగా దర్శనం పొందే విధంగా నిర్మించారు. కాగా ముఖమందపాన్ని19-03-2000 నాడు చక్కగా నిర్మించారు.

ఉత్సవం :

అవనిగడ్డ నుంచి విశ్వనాధపల్లికి ఆరు మైళ్లు. రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి  14 మైళ్లు. బందరు నుంచి 26 మైళ్లు. కోడూరు మీదుగా 28  మైళ్లు. అమ్మవారికి  జరిగే  ఉత్సవం లేదా జాతరకు లక్షలాది ప్రజలు వచ్చి విశ్వనాధపల్లిలో భక్తి ప్రపత్తులతో నాంచారమ్మను సేవిస్తారు. దివిసీమలో లక్షలాది భక్తజనులు పాల్గొనే జాతర ఇది ఒక్కటే. కృష్ణా తీరంలో ఉన్న ఈ అమ్మవారిని దర్శించడానికి కృష్ణా జిల్లా వారే కాక గుంటూరు, గోదావరి జిల్ల్లాల నుండి కూడా అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. ముఖ్యంగా కృష్ణా అవతల తీర గ్రామాలైన చెరుకుపల్లి, కొల్లూరు, పెరవలి, చావలి,  గ్రామాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. ఫాల్గుణ మాసంలో జరిగే ఈ జాతర నభూతోనభవిష్యతి అన్నట్లుగా సాగుతుంది. పిల్లలు లేని స్త్రీలు ఒకప్రక్క ప్రాణాచారాలు పడుతుండుటారు. మరోకప్రక్క రకరకాల మొక్కుబడులు స్త్రీ, బాల, వృద్ద విచక్షణ లేకుండా చెల్లిస్తుంటారు. పాలపొంగళ్ళు  నివేదనగా సమర్పిస్తుంటారు. అమ్మవారికి నైవేద్యంగా మానెడు సోలెడు బియ్యం వండి నైవేద్యంగా  పెడతారు. ఇందులో పెసరపప్పు, కొద్దిగా బెల్లం, నెయ్యి, కుడా చేరుస్తారు. 1950వ సంవత్సరంలో విశ్వనాధపల్లిలో అమ్మవారుకొలుపులు అందుకనే రోజుల్లో అర్చక కుటుంబాలు ఉండేవి. ఇప్పుడవి 70 కుటుంబాలు అయ్యాయి. నేటికి అర్చకులు కాపు కులస్థులే. భక్తి శ్రద్దలతో వీరంతా అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వీరికి తోడుగా ముఖ్యమైన పర్వదినాలలో ఒక బ్రాహ్మణ అర్చకులు కుడా సహాయపడుతుంటారు.

అమ్మవారి ఉత్సవం 15 రోజులు జరుగుతుంది. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క కులం వారి వీధికి అమ్మవారు వెళుతుంది. కాపుల వీధి, అగ్నికుల క్షత్రియ వీధి, కుమారపాలెం, కోతపాలెం, సత్తిపాలెం శివారు అయిన గాబ ( GABA )  గౌడవీధి, నాయి బ్రాహ్మణవీధి, రజక వీధి, దోమ్మర వీధి ఇలా సాగుతూ ఒకరోజు రాత్రి కరణం గారింట్లో కొలువుతీరి వుంటుంది. చివరి రోజు బ్రాహ్మణ అగ్రహారంలో ఉండి  తిరిగి దేవాలయానికి అమ్మవారు చేరుకుంటారు. ఈ 15 రోజుల జాతర వర్ణించడానికి భాషలో పదాలు చాలవు. చూడడానికి మన రెండు చర్మచక్షవులు చాలవు. అంత వైభవంగా అమ్మవారి ఊరేగింపు  సాగుతుంది.

విశ్వనాధపల్లి అగ్రహార స్థాపకుడు బుర్రా విస్సయ్య గారిని, గ్రామం ఏర్పడి సంవత్సరాలు అయిందని స్థానికులు చెపుతున్నారు.  ప్రక్కనే కృష్ణానదీ గ్రామం చుట్టూ సుంక్షేత్రమైన మాగాణి, మంచినీటి చెరువులతో గత వైభవ చరిత్రలో ఈనాటి  అద్దంకి నాంచారమ్మ తల్లితో పేరు ప్రఖ్యాతలు పొందిన గ్రామం ఈ విశ్వనాధపల్లి.

కొత్తపల్లి నుండి విశ్వనాధపల్లికి రెండు మైళ్లు. అవనిగడ్డ నుంచి  విశ్వనాధపల్లికి ఆరు మైళ్లు. రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి 14 మైళ్లు. బందరు నుంచి 26 మైళ్లు. కోడూరు మీదుగా 28 మైళ్లు.

Open chat
Chat With Us
Welcome to our site www.diviseema.info, if you need help simply reply to this message, we are online and ready to help.